సౌఖ్యాలకు నిలయమౌ స్వర్గసీమ మనకేలా

సంఘ సాహిత్యం చదివితే వచ్ఛే స్ఫూర్తి మన దేశం మీద కలిగే ప్రేమ, ఇంక ఎవ్వరూ, ఎక్కడా కలిగించలేరేమో అన్నంతగా ఉంటుంది. శ్రీరాముడు జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి. అన్నాడట, అసలు అమ్మ మీద, జన్మ భూమి మీద ఎందుకంత ప్రేమ అని ఒక్క సారి ఆలోచిస్తే వొళ్ళు పులకరిచేటట్టు బోలెడు ఉదాహరణలు లభిస్తాయి. వాటికి అద్దం పుట్టినదే ఈ సాహిత్యం.

సౌఖ్యాలకు నిలయమౌ స్వర్గసీమ మనకేలా
వాత్సల్యము పంచి ఇచ్చు మాతృభూమి ఉండగా

మాతృమూర్తి, మాతృభూమి తప్ప ఇంక ఎవ్వరు అంత వాత్సల్యం పంచి ఇవ్వలేరట అందుకే రాముడు ఆలా అన్నాడు. నిజమే కదా మనకు అమ్మ దగ్గర దొరికిన ప్రేమ ఇంకెక్కడ లభిస్తుంది? ఆ ప్రేమ కోసం, సకల సౌఖ్యాలను, స్వర్గాలను కాలరాయటానికి సిద్దమే కదా.

దేవతలీ దేశాన దేహధారులౌదురట
జపతప సాధనలు చేసి జన్మరహితులౌదురట
మరల మరల మాధవుడే ఇటకు వచ్చి పోవునంట
మంచివారి బ్రోచి దుర్మతులను ద్రుంచునంట || సౌఖ్యాలకు ||

గాయంతి దేవాః కల గీతికాని
ధన్యాస్తు తే భారత భూమి భాగే
స్వర్గాపవర్గాస్పద మార్గ భూతే
భవంతి భూయః పురుషాః సురత్వాత్.

దేవతలు కూడా ఈ మాకు దేవా పదవులు వద్దు మోక్షానికి దారి చూపే భారత భూమి భాగంలో ఒక్క జన్మ కలిగించు చాలు అని వేడుకుంటారట. అలా దేవతలు ఇక్కడ పుట్టి జపతప సాధనలు చేసి మోక్షం పొందుతారట.

యదా యదాహి ధర్మస్య గ్లానిర్భవతి భారత అని కృష్ణ భగవానుడు అన్నాడు ఈ దేశంలో ధర్మానికి ఎప్పుడు లోటు కలిగినా నేను మళ్ళీ పుట్టి ధర్మాన్ని పరిరక్షిస్తాను అన్నాడు. కేవలం ధర్మ పరిరక్షణ కోసం మాత్రం కాదు, ఆ భగవానుడికి కూడా ఈ మాతృభూమి మీద వున్న మమకారం మరల మరలా ఆ మాధవుడిని ఇక్కడ పుట్టేటట్టు చేస్తుందిట.

అచ్చరల వియచ్చరల సొబగులు మాకేలా
తుంబురాది గంధర్వుల గానాలవి యేలా
కన్నతల్లి కన్నీరీ కరములతో తుడిచెదము
హృత్తంత్రులు మీటి ఆమె ఉల్లము రంజిలజేతుము || సౌఖ్యాలకు ||

ఒక వేళ మా తప్పిదాల వలన నా కన్నతల్లి కంటతడి పెట్టవలసి వస్తే, అమ్మని ఊరడించటానికి (ఆశ్చర్యం ప్రకృతి, అచ్చెరువు వికృతి) అచ్చెరువు కలిగించే వజ్ర వైడ్యూరాల సొబగులు మాకెందుకు? గానం మొట్టమొదట చేసింది తుంబురుడు, గంధర్వులు అని ప్రతీతి, అలాంటి వీనులవిందైన గానాలు కూడా మాకు అవసరం లేదు. అమ్మ కన్నీరు ఈ మా చేతులతో తుడిచేస్తాం, మా హృదయాన్నే వీణకి తీగలాగా మలచి వాటిని మీటి అమ్మ మనసు కుదుట పడేలా చేస్తాం.

చిరయశోలలాముడూ శ్రీరాముడు మనవాడే
సురగంగను భువి కొసగిన భగీరధుడు మనవాడే
ఆత్మాహుతి నొనరించిన అమరవీరులెందరో
ఆదర్శముగా నిలిచిరి ఆకసమున తారలైరి || సౌఖ్యాలకు ||

చీర యశస్సు కలిగిన రాముడు ఈ భూమి మీద పుట్టిన వాడే, అమరావాహిని అయిన, దేవగంగను భువికి రప్పించిన భగీరథుడు, ఈ గడ్డ మీద పుట్టినవాడే. ఈ దేశం కోసం ప్రాణత్యాగం చేసిని అమర వీరులు చాలా మంది మాకు ఆదర్శం గా నిలిచి వారు ఆకాశంలో తారలలాగా మారిపోయారు.

ఇంతటి గొప్ప చరిత్ర గల అమ్మ, మాతృభూమి ఉండగా, స్వర్గం మాకెందుకు….
భారతమాతకు జయం కలుగు గాక.

Advertisements