వాక్పటిమ

కోట్లకు పడగలెత్తిన ఒక మహాకవి తన దాన ధర్మాలతో ఆస్తి మొత్తం కోల్పోయి భిక్షగాడిగా మారపోయాడు. ఒక మహారాజు ఆ కవిని గమనించి గుర్తు పట్టి మీకీ గతి ఎలా పట్టింది అని అడిగితే, చమత్కారంగా అర్జునుడు పరమశివుడిని తన గాండీవంతో తలమీద కొట్టినప్పుడు నాచేతికి ఈ భిక్షపాత్ర వచ్చింది అన్నాడట. రాజుగారు వాపోయి మళ్లీ చెప్పుమని అడిగారు.

గాండీవ దండ తాడితుని కాలగళుని గమనించి
నెత్తిపైనుండిన గంగ భీతిని మహోధధి చేరెను
చందురుడాకశమండగ గోరె వాసుకి ధరాశ్రయుడయ్యె
జగత్పతిత్వము ఉధ్ధండత నిను చేరెడి, ధాత కపాలము నను చేరెడిన్

గాండీవంతో తలమీద కొట్టినప్పుడు కాలగళుని (పరమశివుని) శరీరంలో చాలామార్పులు జరిగాయట
తలమీద గంగ భయంతో మహోధధి అంటే సముద్రం చేరి పోయింది, చంద్రుడు ఆకాశాన్ని అండగా కోరాడు మెడలో వాసుకి భూమిమీద కలుగు లో దాకుంది. జగత్పతిత్వం రాజసం నిను చేరింది, మిగిలిన ధాత కపాలం అంటే బ్రహ్మ కపాలం భిక్షాపాత్ర నను చేరింది. అని ఛలోక్తిగా చెప్పాడట.

గరగరికెల వేంకటపతి

భాగ్యనగరంలో వున్న మా సహోదరుడి ఇంటి దగ్గర వున్న వేంకటేశ్వరస్వామి వారి గుడిలో స్వామివారికి బ్రహ్మోత్సవాలు జరుపుకుంటున్నారు. ఆ ఉత్సవాలు చూసేసరికి ఒక అన్నమయ్య కీర్తన రాసుకోవాలనిపించింది.  కళా తపస్వి విశ్వనాధ్ గారి దర్శకత్వంలో వచ్చిన శుభలేఖ అనే చలనచిత్రం చాలామంది చూసే వుంటారు.  అందులో అన్నమయ్య శృంగారకీర్తన ఒకటి వుంటుంది. దాని అంతర్జాల లంకె ఇక్కడ వుంచుతున్నాను.
ఎప్పటినుంచో ఈ పాట కొన్ని వందలసార్లు విని, చూసి వున్నా దాని భావంమీద పెద్దగా దృష్టి సారించలేదు, సారించినా భావం నా మట్టి బుఱ్ఱకి అందలేదు. ఇన్నాళ్ళకు స్వామివారు దయతలచినట్లున్నారు, ఆ భావం అంతా కళ్ళకు కట్టినట్టు అనిపించింది.
పల్లవి
నెయ్యములల్లో నేరేళ్ళో
వొయ్యన వూరెడి వువ్విళ్ళో
అలమేలుమంగా-శ్రీనివాసుల నెయ్యములు (ప్రేమలు, ప్రణయ కలాపాలు) అల్లనేరేడుపళ్ళలా తీయగావుంటాయని అన్నమయ్య గారి భావన, వారి శృంగారం తలుచుకుంటేనే ఉవ్వుళ్ళు ఊరుతుందట.
చరణాలు
పలచని చెమటల బాహుమూలముల-
చెలమలలోనాఁ జెలువములే
థళథళమను ముత్యపుఁ జెఱగు సురటి
దులిపేటి నీళ్ళతుంపిళ్ళో
విరహంతో వేచియున్న అమ్మవారి మేను చెమరించింది. అమె బాహుమూలలు అంటే చంకలు చెమరుస్తున్నాయట పలుచని చెమటలు కారిపోతున్నాయి. చెమటల ఊటలనిండిన ఆమె బాహుమూలములు కొలనులవలే అందంగా ఉన్నాయి.  ముత్యాలు పొదిగిన చెంగుతో ఉన్న చీర కట్టుకుని ఉన్న అమ్మవారు, తన విరహతాపం తడ్డుకోలేక ఆ చీరచెంగుని తీసి విసనకర్రలా పట్టుకుని విసురుకుంది. చెంగులోని ముత్యాలు తళతళ మెరుస్తున్నాయి. విసిరిన జోరుకి చెమట చుక్కలు చిరుజల్లుల్లా రాలుతున్నాయి.
తొటతొటఁ గన్నులఁ దొరిగేటి నీళ్ళ
చిటి పొటి యలుకల చిరునగవే
వటఫలంబు నీ వన్నెల మోవికి
గుటుకలలోనా గుక్కిళ్ళో
ఇంతలోనే స్వామి వారు వచ్చారు, ఆ ఆనందంలో అమ్మవారి కన్నులు అదరటం మొదలు పెట్టాయి, వారి రాకను ఆనందిస్తున్న తన్మయత్వంలో ఆమె కన్నులనుండి బాష్పాలు రాలాయి. ఇంతకు మునుపు అమ్మవారు అనుభవించిన విరహం గుర్తుకు వచ్చి చిలిపి అలకలలు నటిస్తూ, పెదవుల్లో చిరునవ్వులు చిందిస్తూ ఉంది. కాస్త విరహం, కాస్త సిగ్గు కలిపి మర్రిపళ్ళలా ఎర్రగా అమ్మవారి వున్న అధరాలు, ఆ అధరామృతం పంచే ఆ పెదవులు స్వామివారిని గుటకలు వేయిస్తున్నాయి. 
గరగరికల వేంకటపతి కౌఁగిట
పరిమళములలో బచ్చనలే
మరునివింటి కమ్మనియంప విరుల-
గురితాఁకులినుప గుగ్గిళ్ళో
అలంకార ప్రియుడైన స్వామివారు గరగరికెలతో నానావిధ పరిమళములతో వున్న శ్రీవేంకటేశుడి కౌగిలిలో ఒదిగిపోయింది శ్రీమహాలక్ష్మి.  అమ్మవారి ఆ విరహతాపాన్ని చల్లార్చగలిగేది, కేవలం స్వామివారి బిగి కౌగిలేకదా, ఆ తాపవేళలో మన్మథుడు తన చెరకు విల్లునుండి వారి మీదకి పువ్వుల బాణాలు కూడా ఇనపగుగ్గిళ్ళులా అనిపించాయట. ఇనుపగుగ్గిళ్ళులా ఎందుకు? అన్న సందేహం కలగచ్చు.  వారి రస క్రీడలో ఒకరి మేను మీద ఒకరు చేసుకున్న గాయాలటువంటివి మరి. ఇంకా చిత్రమేమిటంటే ఆ అంపవిరుల గాయాలుకూడా వారిరువురికీ కమ్మగా రుచిస్తున్నాయట.
కొన్ని పదాలకు అర్థాలు :
నెయ్యము = స్నేహము, ప్రియము
అల్లోనేరేళ్ళో = అల్లనేరేడు పండు, స్త్రీలుపాడే పాట (జానపదం)
ఒయ్యన = తిన్నగ, మెల్లగ
ఉవ్విళ్ళూ = తపనలు, తహతహలు
పలచని చెమట = లేత చెమట, సన్నని చెమట
బాహుమూలములు = చంకలు, కక్షములు
చెలమలు = గుంటలు,  కొలనులు, పల్లము
చెలువము = అందము, సౌందర్యము
ముత్యపు = ముత్యాల
చెఱగు = చెంగు, చీర కొంగు, పైట
సురటి = విసనకఱ్ఱ
దులుపేటి = దులుపుతున్న
నీళ్ళ తుంపిళ్ళో = తుంపరలు, వాన చినుకులు
తొటతొట కన్నుల తొరిగేటి నీళ్ళు = అదురుతున్న కళ్ళనుండి రాలేటి కన్నీరు
తొరిగేటి = రాలేటి
చిటిపొటి యలుకలు = చిన్న చిన్న గొడవలు, చిలిపితగాదా, అల్పమైన , 
చిరునగవే = చిరునవ్వులే
వటఫలంబు = మర్రిపండు
వన్నెల = సొభగు
మోవి = పెదవి
గుక్కిళ్ళు = గుటక మింగు శబ్ధము
గరగరికల = సింగారమైన, అలంకారములుగల
బచ్చనలు = కలయికలు, కూటములు, ఒదిగిపోవడము
మరునివింటి = మన్మథుడి చెరకు విల్లు
కమ్మని = కమ్మనైన
అంప విరులు = పువ్వుల బాణాలు
గురి = లక్ష్యం
తాకు = తాకేటి
గుగ్గిళ్ళు = ఉడకబెట్టిన శనగలు

ఛత్రపతి

ఛత్రపతి సినెమా చూసే వుంటారు, దానిలో పాటకి అర్ధం అద్భుతంగా వుంటుంది. నాకర్ధమయినంత వరకూ ఇక్కడ రాసుకుంటున్నాను

అగ్ని స్ఖలన సందగ్ధ రిపు వర్గ ప్రళయ రధ ఛత్రపతి
మధ్యందిన సముధ్యత్కిరణ విద్యుత్ద్యుమని ఖని ఛత్రపతి
తజ్జం తజ్జను తధిం ధిరన ధిం ధిం తకిట నట ఛత్రపతి
ఉర్వీ వలయ సంభావ్య వర స్వచ్చంద గుణధి

కుంభీ నిగర కుంభస్థ గురు కుంభి వలయ పతి ఛత్రపతి
ఝంఝా పవన గర్వాపహర వింధ్యాద్రి సమ-ధ్రుతి ఛత్రపతి
చండ ప్రభల దోర్ధండ జిత దోర్దండ భట తటి ఛత్రపతి
శత్రుప్రబల విచ్ఛేదకర భీమార్జున ప్రతి

ధిగ్ ధిగ్ విజయ ఢంకా నినద ఘంటారవ తుషిత ఛత్రపతి
సంఘ స్వజన విద్రొహి గణ విధ్వంస వ్రత మతి ఛత్రపతి
ఆర్త త్రాన దుష్తధ్యుమ్న క్షాత్ర స్పూర్తి ధిధితి
భీమక్ష్మా పతి ….శిక్షా స్ఫుర్తి స్థపతి!!

తన శత్రుసమూహమును (రిపువర్గ) తన అగ్నివల్ల (అగ్నిస్ఖలన) దహించివేసేవాడు (సందగ్ధ), ప్రళయమనే కాల రథానికి అధిపతి ఛత్రపతి.
(మధ్యందిన) మిట్ట మధ్యాహ్నపు (సమ్ ఉద్యత్) ప్రకాశవంతమైన కిరణములతో (విద్యుత్ద్యుమణి) సూర్యులకు  నిలయం (ఖని).
తఝ్ఝణుతఝణు-తద్ధింధిరన-ధీంధీంతకిట అనే జతులకు తగిన నాట్యమాడే నటధీరుడు. నటరాజుగా.

భూగోళంలోని (ఉర్వీ-భూమి, వలయ-గోళం) గౌరవించదగినవారిలో (సంభావ్య) గొప్పవాడు (వర). స్వేచ్ఛాయుతమైన (స్వచ్చంద) గుణములకు ఆలవాలం (గుణధీ).

శ్రేష్ఠమైన (నిగర) ఏనుగు (కుంభీ) కుంభస్థలం (కుంభ) పైనున్న (స్థ) గురువు, అటువంటి ఏనుగుల వలయానికి (సమూహానికి) పతి నాయకుడు.

ఝంఝా పవన, వేగంగా వీచే గాలుల గర్వాన్ని అణచగల (గర్వాపహారి) వింధ్య పర్వతాలతో సమానమైన కాంతి (ద్యుతి) కలిగినవాడు. .

భయంకరమైన (చండ) ప్రత్యేకమైన (ప్ర) బలవంతమైన చేతికర్రచే (దోర్దండ) జయింపబడిన (జిత) దండధారులైన భటులకు రాజు. అంటే శత్రువులను జయించగల దండధారులైన భటులకు రాజు.

ప్రత్యేక (ప్ర) బలాన్వితులైన శత్రువులను రూపుమాపడంలో (విచ్ఛేదకర) భీమార్జునులతో పోలిక (ప్రతి) కలవాడు.

అన్ని దిక్కులలో విజయభేరుల (విజయ ఢంకానినద, ఘంటారవ) మ్రోతలచే ఉప్పొంగేవాడు (తుషిత-తృప్తి).

సంఘానికి, తనవారికి విశేషమైన ద్రోహం చేసే సమూహాలను ధ్వంసంచేయడమనే మతమునందు నిలచిన మనస్సుకలవాడు.

ఆర్తులకు రక్షకుడు. దృష్టద్యుమ్నుడి లాగానే క్షత్రియ పరాక్రమ కిరణాలు (దీధితి) ప్రసరింపజేయగలవాడు. ధీమంతులకీ భూమికీ (క్ష్మా) నాయకుడు. శిక్షాస్మృతిని అమలుపరిచే అధినాయకుడు (స్థ-ఉన్న).