ఆదర్శ పురుషుడి గుణగణాలు

​రామాయణం ఒక గొప్ప సందేశం:— వాల్మీకి మహా ముని నారదునితో ఇలా అడిగాడు….

కోన్వస్మిన్సామ్ప్రతం లోకే గుణవాన్కశ్చ వీర్యవాన్ .ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రత:৷৷1.1.2৷৷ 
అస్మిన్ లోకే గుణ వాన్ కః?  ఈలోకంలో చెప్పబడిన సద్గుణాలన్నీ కలిగిన వాడు, వీరు ల్లో కెల్లా వీరుడు, ధర్మజ్ఞుడు, కృతజ్ఞుడు సత్య వాక్ పరిపాలకుడు, ఈ లోకంలో వున్నాడా?
చారిత్రేణ చ కో యుక్తస్సర్వభూతేషు కో హిత: .విద్వాన్క: కస్సమర్థశ్చ కశ్చైకప్రియదర్శన: ৷৷1.1.3৷৷
అతని చరిత్రలో ఎటువంటి మచ్చ లేని వాడు, సర్వ భూతాలకూ హితం మాత్రమే చేయదలిచేవాడూ, సర్వ విద్యలూ నేర్చుకున్నవాడూ సమర్ధుడూ,మళ్ళీ మళ్లీ చూడాలనిపించే ప్రియ దర్శి ఉన్నాడా?
ఆత్మవాన్కో జితక్రోధో ద్యుతిమాన్కోనసూయక: కస్య బిభ్యతి దేవాశ్చ జాతరోషస్య సంయుగే ৷৷1.1.4৷৷ 
ఆత్మవాన్ కః? తనను తాను నిగ్రహించుకోగలిగేవాడు, క్రోధాన్ని జయించినవాడూ అసూయ లేనివాడూ, ఎవరి రోషంతో దేవతలు కూడా భయభ్రాంతులవుతారో అటువంటి వాడు ఈ భూలోకంలో వున్నాడా? 
ఏతదిచ్ఛామ్యహం శ్రోతుం పరం కౌతూహలం హి మే మహర్షే త్వం సమర్థోసి జ్ఞాతుమేవంవిధం నరమ్ ৷৷1.1.5৷৷
ఇటువంటి గుణాలున్నవాడు ఈ భూలోకంలో వున్నాడా నాకు చాలా కుతూహలం గా వుంది అన్నిటా సమర్ధుడైన అటువంటి వాడి గురించి ముల్లోకాలూ చుట్టే మీకు తెలిస్తే వినాలనుంది అని వాల్మీకి నారదం పరిపపృచ్ఛ అంటే పరి పరి విధాల గుచ్చి అడిగాడు.
దానికి నారదులవారు ఇలా జవాబుచెప్పారు. జగ్రత్తగా విను నువ్వడిగిన గుణాలన్నీ కలిగిన వాడు దొరకటం అరుదు, సామాన్యమైన విషయం కాదు. కానీ అలాంటి గుణాలున్నవాడు ఈ లోకంలో ఒక్కడున్నాడు
ఇక్ష్వాకువంశప్రభవో రామో నామ జనైశ్శ్రుత: .నియతాత్మా మహావీర్యో ద్యుతిమాన్ధృతిమాన్ వశీ ৷৷1.1.8৷৷ 
నియతాత్మ అంటే శరీర మనో నిగ్రహం కలిగినవాడూ, మహా వీరుడూ, ధ్యుతిమాన్ అంటే సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోగలిగిన శక్తి వున్నవాడూ, ధృతిమాన్ ధృతి అంటే వెగం, వెగంగా సమస్య పరిషరిచగలిగె శక్తి వున్నవాడూ, చివరగా వశీ అంతె తన మంచితనంతో అందరినీ వశపరుచుకునే వాడూ ఒకడు  వున్నాడు.  
బుద్ధిమాన్నీతిమాన్వాగ్మీ శ్రీమాన్ శత్రునిబర్హణ: .విపులాంసో మహాబాహు: కమ్బుగ్రీవో మహాహను: ৷৷1.1.9৷৷
బుద్ధిమంతుడూ, నీతిమంతుడూ, వాగ్వీ అంటే వేదాలను చదువుకున్నవాడూ శ్రీమాన్ అంటే లక్ష్మీ కటాక్షంతో మంగళకరంగా వున్నవాడు, శత్రువులను నాశనం చేసేవాడూ, ఆజానుబాహుడూ, శంఖంలాంటి మెడ, గుండ్రని చెక్కిళ్ళు వున్నవాడు, 
అతడే, ఇక్ష్వాకు వంశంలో ప్రభవించి రాముడనే పేరుతో ప్రజలు పిలిచుకుంటారు. శ్రీరాముడు సకల గుణాభిరాముడు, రాముని గుణాలను వర్ణించటానికి భాషకు పదాలు చాలవు అని నారదుడు జవాబు చెప్పాడు. 
రామాయణం ఇతిహాసమా పురాణమా అనే ప్రశ్న పక్కన పెడితే మనకు వాల్మీకి రామాయణం ద్వారా ఒక ఆదర్శ పురుషుడి ఆవిష్కారం జరిగింది. ఒక్క రాముని గుణాలను తెలుసుకుని జీవితంలో ఆచరణలో పెడితె చాలు మన జన్మ సార్ధకం అయిపొతుంది. ఇలా రాముని గుణాలను రామయణంలో మూడు చోట్ల ఆవిష్కరించారు. సమయం వచ్చినప్పుదు మిగితా గుణాలను కూడా వివరించే ప్రయత్నం చేస్తాను.
బాపు గారి శ్రీరామరాజ్యం సినిమాలో ఇన్ని గుణాలను ఒక్క పాటలో జొన్నవిత్తుల వారు చాలా అందంగా చెప్పారు 
ఒక  నాడు నారద  మహర్షుల వారిని నెనొక ప్రశ్న అడిగాను
ఎవడున్నాడీ  లొకంలొ ఇదివరకెరుగనివాడు ఎవడున్నాడీ కాలంలొ సరియగు నడవడివాడు 

నిత్యము  సత్యము పలికే వాడు, నిరతము ధర్మము నిలిపే వాడు  

చేసిన మేలు మరువని వాడు, సుర్యునివలనే  వెలిగేవాడు

యెల్లరికి చలచల్లని వాడు, యెద నిండా దయ గల వాడు

ఎవడు ఎవడు ఎవడూ?

అపుడు నారద మహర్షులవారు ఇలా సెలవిచ్చారు 

ఒకడున్నాడీ  లోకంలో ఓం కారానికి సరిజోడు 

ఇనకులమున ఈ  కాలంలో జగములు పొగిడే  మొనగాడు 

విలువలు కలిగిన విలుకాడు, పలు సుగుణాలకు చెలికాడు 

చెరగని నగవుల నెలరేడు, మాటకు నిలబడు ఇలరేడు

దశరథ తనయుడు దానవ దమనుడు జానకి రమణుడు 

అతడే శ్రీరాముడూ శ్రీ… రాముడు…

పెద్దపండుగ

మనకి పండుగలు ఎన్ని వున్నా సంక్రాంతినే పెద పండుగ అంటారు ఎందుకని?
తొమ్మిది, పది రోజులుండే నవరాత్రులు, దశమి, నెల వుండే కార్తీక మాసం, నాలుగు నెలలుండే  చాతుర్మాస్యం వదిలేసి కేవలం నాలుగు రోజులుండే సంక్రాంతిని పెద పండుగ అంటారు ఎందుకని? కాస్త ఆలోచించండి, ఇలాంటి చిన్న విషయాలను నేర్పిన మన సంస్కృతి గొప్పతనం మనకు అర్థం అవుతుంది… 

సనాతన ధర్మంలో మనం జరుపుకునే పండుగలు చాలా వున్నాయి. కొన్ని ధార్మికంగా జరుపుకునే పండుగలు ఒక్క మతం పరంగానో వారు నివసించే ప్రదేశం మీద ఆధార పడి చేసుకునేవి ఉదాహరణకి కార్తీక మాసం శైవులు మాత్రమే ఎక్కువగా జరుపుకునే పండుగ, అలాగే ధనుర్మాసం వైష్ణవులు మాత్రమే ఎక్కువగా జరుపుకునే పండుగ. పొలాల అమావాస్య మొదట్లో ఇది కృష్ణా, గోదావరి జిల్లాలవారు మాత్రమే చేసుకునే వారు అని  విన్నాను అలాగే బోనాల పండుగ తెలంగాణా రాయలసీమ వారు మాత్రమే జరుపుకునే పండుగ. మరి కొన్ని ధార్మిక పండుగలు అందరూ జరుపుకునేవి అంటే విజయదశమి, దీపావళి, ఉగాది, రథసప్తమి. ఒక విషయం పండుగ ఏదైనా ఎవరు ఏ పేరుతో జరుపుకున్నా సనాతన ధర్మం లో ప్రకృతి సంబంధిత విషయం ఒకటి ఖచ్చితంగా ఉంటుంది. 

ప్రస్తుతం సంక్రాంతి: మిగతా పండుగలకు కొంత ధార్మిక కోణం ఖచ్చితంగా ఉంది, కానీ సంక్రాంతికి ఏ ధార్మిక కోణము లేదు, పైగా అందరూ జరుపుకునే పండుగ. మరి ఇంతకీ సంక్రాతి ఏ ధార్మిక కోణం లేకపోయినా మనం ఎందుకు జరుపుకుంటున్నాము? ఏ దేవుడిని ఉద్దేశించి మనం సంక్రాంతి జరుపుకుంటాము? కొందరు సూర్యుడి పేరు చెప్పవచ్చు, కాసేపు సూర్యుడి పేరున సంక్రాంతి జరుపుకుంటున్నాము అనుకుంటే ఇప్పుడు చేసే ఏ కార్యక్రమం లోనూ సూర్యుడిని ఉద్దేశించి జరిపే పూజలు ఏమి లేవు కదా!!! సంక్రాంతి అచ్చంగా ప్రకృతి సంబంధిత పండుగ. సరిగ్గా సంక్రాంతి సమయానికి మన అన్నదాతలు రైతన్నలకు పంట చేతికి వస్తుంది, కోతలు మొదలు అవుతాయి ఇంటినిండా ధన ధాన్యాలు నిండుగా ఉంటాయి. ఆస్తిక నాస్తిక సంబంధం లేకుండా అందరూ సంతోషంగా వుంటారు. ఆ సంతోషాన్ని కేవలం మన ఇంటితో పరిమితం చేయకుండా పలు దాన ధర్మాలు చేసే గొప్ప ఆచారం ఈ పండుగలో ఉంటుంది. 
ఈ విషయంలో  సిరివెన్నెలగారి పాట నాకు ఎంతో ఇష్టమైన పాట గుర్తుకు వస్తుంది.

శీతాకాలంలో ఏ కోయిలైన రాగం తీసేనా ఏకాకిలా…

మురిసే పువులులేక విరిసే నవ్వులులేక ఎవరికి చెందని గానం సాగించునా

పదుగురి సౌఖ్యం పండే దినమే పండుగ కాదా

ఆనాడు వాసంత గీతాలూ పలుకును కద.
అందరూ చలిలో,ఆకలితో వున్నప్పుడు వారి బాధను చూసి కోకిల కూడా పాడటం మానేసిందిట, వసంత కాలం రాగానే పంట చేత రాగానే అందరూ సుఖంగా వున్నప్పుడే ఆ కోకిక వసంత గీతాలు ఆలపిస్తుందని, అంత కన్నా పెద్ద పండుగ ఇంక ఏమి ఉంటుంది అంది కోకిల ఆనందంగా పాడుతుందిట. జ్ఞానం తెలియని కోకిలలకే పదిమంది సుఖంగా వున్నపుడు పాడటం మొదలు పెడితే, అన్ని తెలిసిన మనం అందరూ సుఖంగా వున్నారు అని అనుభవించగల మనం ఆ ఆనందాన్ని ఎలా వ్యక్త పరచుకోవాలి? అందుకే అన్నిటికన్నా పే…..ద్ద పండుగ సంక్రాంతి రోజున చేసుకుంటాము.

ఈ సంక్రాంతి సమయంలోనే మనకు తారసపడతారు. సంక్రాంతి సమయం లో అందరూ సుఖంగా వున్నపుడు కూడా తిండి దొరకక బాధ పడుతున్న కొందరు అభాగ్యులుంటారు. అటువంటి వారికోసం హరిదాసు ఇంటింటికీ వెళ్ళి బియ్యం పప్పులు సేకరించి పంచిపెడుతుంటారు. నాకు మా నాన్న గారి తో కలిసి Food corporation of India పని చేసే ఒకాయన తెలుసు ఆయన ఈ సంక్రాంతి సమయం లో నెల రోజులు పనికి సెలవు పెట్టి హరిదాసు వేషం వేసుకుని అందరికీ దాన ధర్మాలు చేసేవారు. అప్పటి వరకూ హరిదాసు అంటే అదొక రకమైన యాచన (అడుక్కోవటం) అనుకునేవాడిని ఈ విషయం తెలిసిన తరువాత నాకున్న అభిప్రాయం మారిపోయింది వారి పట్ల అపారమైన గౌరవం వచ్చింది.

పక్క వారి గుండెల నిండా చిక్కనైన వేదన నిండ 

ఏ హాయి రాదోయి నీ వైపు మరువకు అది 

అనే సిద్ధాంతం ఆచరించి చూపెట్టిన  మహానుభావులు ఆ హరిదాసులు. అదే సంక్రాంతి పెద పండుగ