ఈ అద్భుతమైన మరాఠీ గీతం ఎవరు వ్రాసారో తెలియదు, ఆ పాట విన్నాకా మనసు అక్కడే ఆగిపోయింది ఆ అనుభూతికి అక్షర రూపం ఇస్తే కానీ నాకు నిద్ర పట్టేలా లేదు అన్నంతగా దానిలోనే మునిగితేలుతోంది. ప్రతీ పదమూ ప్రతీ చరణమూ ఒక అధ్బుతం అని నాకు అనిపించింది అనిపిస్తోంది.
గత వారం రోజులుగా ఇదొక్కటే పాట తిప్పి తిప్పి వినేంతగా..
ఇంక వేరే ఏమి ధ్యాస లేకుండా వున్నంతగా..
నాకు మరాఠీ రాదు, నాకు అర్థమైనంత వరకూ నాకు కలిగిన అనుభూతిని ఇలా వ్యక్త పరిచే ప్రయత్నం చేస్తాను.
कबीराचे विणतो शेले कौसल्येचा राम, बाई कौसल्येचा राम
भाबड्या या भक्तासाठी देव करी काम
కబీర్ దాసు ఒక చేనేత కార్మికుడు, తాను చేనేత పని లో భాగంగా ఒక శాలువా అల్లుతూ రాముడి భక్తి పారవశ్యం లో మునిగి పాటలు పాడుతూ పని మరచిపోయాడుట, తాను తన్మయత్వంలో వుండగా ఆయన పాటకి కౌసల్యచా రామ్ అంటే కౌసల్య కుమారుడైన రాముడు వచ్చాడుట. ఎంతటి మహా భక్తుడో, అమాయకుడో కదా భగవంతుడే వచ్చి పాటలు వింటూ ఆయన పని చేయటం (శాలువా అల్లటం మొదలు పెట్టాడుట).
ఎంతటి అద్భుతమైన సన్నివేశమో తలచుకుంటోనే మనసులో ముద్రించుకుపోయింది, మరలా మరలా అదే సన్నివేశం కళ్ళముందు కనిపిస్తోంది నాకు.
एक एकतारी हाती, भक्त गाई गीत
एक एक धागा जोडी, जानकीचा नाथ
राजा घनश्याम
ఇక్కడ భక్తుడు తన చేతితో ఏకతారీ అంటే చేతితో, తీగల ద్వారా ధ్వనించే సంగీత పరికరం. ఒకో తీగ మీటుతూ భక్తుడు తన్మయత్వంలో పాడుతుంటే, ఆ గానాన్ని వింటూ ఒక ఒక దారాన్ని జత చేస్తున్నాడుట జానకీ నాధుడు, ఘన శ్యాముడు రాజు అయిన రాముడు, కౌసల్యచా రామ్..
दास रामनामी रंगे, राम होई दास
एक एक धागा गुंते, रूप ये पटास
राजा घनश्याम
కబీర్ దాసు అని కాదా ఆయన పేరు, రాముడికి దాసుడినని పేరు ఎప్పుడు పెట్టుకున్నాడో రాముడే ఆయనకి దాసుడు అయిపోయాడు, ఒక్కో దారాన్ని పెనుస్తున్నాడు అలా చేస్తే ఆ శాలువా దారాలు అన్నీ చదరంగపు పట్టి లా కనిపిస్తున్నాయిట. రాజా ఘన శ్యామ్.. కౌసల్యచా రామ్..
विणुन सर्व झाला शेला, पूर्ण होई काम
ठायी ठायी शेल्या वरती दिसे रामनाम
गुप्त होई राम
అలా పాటలు వింటూ మొత్తం శాలువా అంతా అల్లటం పూర్తి చేసేశాడు రాముడు. మరి రాముడు పూర్తి చేసిన పని లో రామ నామం కాక ఇంకేం వుంటుంది? అలాగే శాలువా అన్నీ దీశాలలోనూ రామనామమే కనిపిస్తోందిట. అక్కడ భక్తుడి పాట పూర్తి అయింది, ఇక్కడ రాముడి అల్లిక పూర్తి అయింది. మరాఠీ లో పూర్ణ హుయి కామ అని వ్రాసారు కామ అంటే పని అని అర్థం కోరిక అని కూడా అర్థం వుంది. అంటే భక్తుడి తనివితీరా పాడాడు, పాడాలని, వినాలని కోరిక ఇద్దరికీ (భక్తుడికీ, భాగ్యవంతుడికీ) పూర్తి అయింది అందుకే గుప్త హోయి రామ అంటే రాముడు అదృశ్యం అయిపోయాడు.
हळू हळू उघडी डोळे, पाही तो कबीर
विणोनिया शेला गेला सखा रघुवीर
कुठे म्हणे राम
రామ గానం మీద తనివి తీరిన భక్తుడు కబీర్ నెమ్మదిగా కళ్ళు తెరిచాడు, అక్కడ తన సఖుడైన రఘువీరుని చేత పూర్తిగా అల్లిన శాలువా ని చూసి ఆనందంలో ములిగి మరలా క్షణంలోనే కనిపించని రాముని వెతకటం మొదలు పెట్టాడు कुठे म्हणे राम అంటే ఎక్కడ నా రాముడు అని..
కౌసల్యచా రామ్..
నాకు చాలా నచ్చిన విషయం కౌసల్య కుమారుడు అని అనటం, మనం రాముని పేరుకి ఎక్కువ గా దశరధ నందన, దాశరధి, రఘు అని తండ్రి లేదా కులం పేరుతో పిలవటం చాలా సార్లు చూసి వుంటాం. కానీ తల్లి పేరు పెట్టి సంబోధన చాలా అరుదు (రోజూ సుప్రభాతం లో వింటాం అనుకోండి అది కాక ఇక ఎక్కడా నేను వినలేదు) అందుకే నాకు ఇంకా బాగా నచ్చింది.
ఈ పాటను ఈ కింది అంతర్జాల లంకె ద్వారా వినవచ్చు.