యోగులు సాగిన మార్గమిది

ఒక పాట ని కేవలం సంగీత పరంగానో లేదా కేవలం సాహిత్య పరంగానో నేర్చుకుంటే దానిలోని మాధుర్యాన్ని పూర్తిగా ఆస్వాదించనట్లే అని నా అభిప్రాయం. ఎంతో భావనాత్మకమైన ప్రేరణ పొంది గేయ రచయిత సాహిత్యాన్ని మనకి అందిస్తే,  దాన్ని మరలా మరలా మననం చేసుకోగలిగేలా సంగీతం కూర్పు చేయటం గాయకుల కృషి. అందుచేత మనం ఆ రెండింటినీ మనకు హృద్గతం చేసుకుంటే తప్ప ఆ పాటకు మనం న్యాయం చేసినట్లు  కాదు కదా. అటువంటి సంగీత సాహిత్య విలువలు మేళవించిన, నా మనసుకి ఇష్టమైన ఒక పాట ఇక్కడ పంచుకోవాలని అనిపించింది.  
పల్లవి:

యోగులు సాగిన మార్గమిది 

లోకములేలిన దుర్గమిది

శాశ్వత శాంతుల స్వర్గమిది

భగవాధ్వజ ఛాయలలో మాయని భరతావని దిగ్విజయమిది.
“జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ” అంటాడు భగవత్గీత లో కృష్ణ భగవానుడు, అంటే పుట్టినవానికి మరణం తప్పదు; మరణించవానికి పుట్టుక తప్పదు అని భావం. ఈ ప్రపంచంలో ఏదీ చావుపుట్టుకలకు అతీతం కాదు. కానీ మన సనాతన భారతీయ సంస్కృతి గొప్పతనం ఏమిటంటే అది అజరామరం అంటే ఎప్పుడు పుట్టిందో ఎవ్వరికీ తెలియదు, అందుకని దానికి అంతం కూడా లేదు. ఈ విషయాన్ని గ్రహించిన మన పూర్వీకులు, యోగులు ఈ సనాతన సంస్కృతిని అవలంబించి మనకు అందించారు. సనాతనం కనుక, మన సంస్కృతి వంటపెట్టుకున్న జ్ఞానానికి పరిధులు లేవు, తద్వారా మన సంస్కృతి, లోకానికి జ్ఞాన భిక్ష పెట్టిన ప్రదేశం అదే లోకములేలిన దుర్గం అంటే. లోకాలని ఏలటం అంత సులువైన విషయం కాదు కదా, చాలా మారణహోమం జరగకుండా ఒక్కడు రాజు కాలేడు, కానీ సనాతన సంస్కృతి శాంతి మార్గం లో మాత్రంమే లోకాలను వశం చేసుకుంది. శాంతి ఎక్కడ ఉంటే అక్కడే స్వర్గం కదా. ఇంత గొప్ప ఈశ్వరీకార్యం కేవలం భగవాధ్వజ ఛాయలలో అంటే శాంతి, త్యాగ మనే నీడలో మన అమ్మ భరతమాత పొందిన దిగ్విజయం కాక మరేమిటి.
చరణం-1:

రాయకి రప్పకి చెట్టుకి చేమకి చరాచారమ్ములకన్నిటికి

నతమస్తకమౌ నతులు సలపు పరమోన్నతమౌ ఘన సంస్కృతిది

వినయము విద్యాభూషణములు కల విమల మనస్కుల వీడు ఇది 

దురహంకారము దరి చేరని మహనీయ జీవనుల మార్గమిది || యోగులు ||
ఈ సంస్కృతి గొప్పతనం ఈ చరణం లో ఆవిష్కరించారు, సకల చరాచరాలన్నిటికి సమానమైన ఈశ్వరీ శక్తి వుంది అని ప్రగాఢంగా (నతమస్తకం అంటే మన మెదడులోని లోతైన పొరలకు కూడా తెలుసు అని) అర్థం చేసుకున్న గొప్ప జీవన శైలి మనది, అందుకని రాయికి, రప్పకి, చెట్టుకి అన్నిటికి మనం నతులు (నమస్కారాలు) సలుపే, ప్రకృతి ఆరాధకులు వున్న సంస్కృతి ఇది. పరమోన్నతమౌ ఘన సంస్కృతిది ఇదొక అద్భుతమైన ప్రయోగం మనం చాలా చాలా చాలా పెద్దది అని చెబుతూ ఉంటాం అలాగే ఉన్నతం అంటే గొప్పది, పరమ ఉన్నతం అంటే ఇంకా గొప్పది, ఘనమైనది అంటే గొప్పది. ఒక్కమాటలో గొప్పది అని చెప్పలేక ఇన్ని ఉపమానాలు వాడారు. 

గొప్పతనం ఎక్కడ వున్నా అక్కడ కాస్త గర్వం పెరుగుతూ ఉంటుంది, తద్వారా మూర్ఖత్వం తద్వారా అహం ఇలాంటి అవగుణాలు పెరుగుతాయి. కానీ సనాతన ధర్మంలో ఇలాంటి అవలక్షణాలకు తావు లేకుండా ఎంత చదివితే అంత వినయంగా ఉండాలి అని అడుగడుగునా మనకు నేర్పి పెట్టేసారు  అందువల్ల అహంకారం అనేదే దరిచేరకుండా జీవించిన,  (మలం అంటే కుళ్ళు విమలం అంటే కుళ్ళు లేనిది అని) విమలమైన మహనీయుల అవలంబించిన మార్గం సనాతన ధర్మం.
చరణం-2:

సరళ జీవనము విరల చింతనము అవిరళ సరళి గణించినది 

ఆద్యంతములకు అటు నిటు నిలిచి ఆనందము పరికించినది

గీతా జ్యోతిని ఒసగి చేతముల చేయూతగా నడిపించినది 

అజ్ఞానమునకు అందని ద్రష్టలు కాంచిన కాంచన స్వప్నమిది || యోగులు ||
సరళమైన జీవనశైలి అంటే ఏ విధమైన హంగులు ఆర్భాటాలకు అలవాటు పడుకుండా నిరంతరం త్యాగం, ప్రేమ, అనురాగం తో నిండిన స్థితి. విరళం అంటే విశాలం, చూడటానికి చిన్న గుడిసెలో వున్నా ఆలోచనా పద్దతి వసుధైక కుటుంబకం అంత గొప్పది అదే విరళ చింతనం అంటే, మనిషిగానే పుట్టి మనిషిగానే పెరిగి మహిత చరితను గడించవచ్చు అని ఆ పరంధాముడే రాముడై జీవించిన గొప్ప మార్గం మనది. ఇక్కడ మొదలు తుది లేదా గెలుపు ఓటమి ల మీద కన్నా చేసే కార్యంలో ఆనందాన్ని ఆశ్వాదించటం మనకు నేర్పుతారు. “కర్మణ్యేవ అధికారస్తే  మా ఫలేషు కదాచన” అంటే అదే… మన జ్ఞానాన్ని పది మందికి పంచి పెట్టే ఈ ఈశ్వరీ కార్యంలో గెలుపు ఓటముల కన్నా ప్రతిఫలాపేక్ష కన్నా పనిలో ఆనందం ఆశ్వాదించగలిగే గొప్ప పద్ధతి. ద్రష్ట  అంటే జ్ఞాని అని అర్థం, అజ్ఞానానికి తావు ఇవ్వని గొప్ప ద్రష్టలు ఈ సంస్కృతి గొప్పతనాన్ని గుర్తించి ఆ బంగారు స్వప్నాన్ని మనకు ప్రతిఫలాపేక్ష లేకుండా అందిచారు. 
కాలుడు రేపిన చీకటి ధూళి రక్కసి మూకల కర్కశ కేళి 

విసరిన వికృత విష వలయమ్మున విస్మృతి పొందిన విభవమిది 

పండిన పాపము పండగ కేశవుడవతరించు సంకేతమిది 

హాలహలమును అరాయించుకొను అమృత హృదయుల స్వర్గమిది || యోగులు ||
ఎక్కడ జ్ఞానం, సంపద, ఆనందమూ వుంటాయో దాని మీద రాక్షసమూకల  కళ్ళుపడతాయి ఆ రక్కసులకి అర్థం కాని, అర్థం చేసుకోలేని మన సంస్కృతి మీద నిరంతరం వారు చేసిన దాడుల వలన మన సంస్కృతి గొప్పతనాన్ని ,వైభవాన్ని మనమే మరచిపోయేలా చేస్తుంది. అటువంటి చీకటి క్షణాలలో కేశవుడే అవతరించి సంస్కృతిని కాపాడతాడు “యదా యదా హి ధర్మస్య  గ్లానిర్భవతి భారత అభ్యత్థానమధర్మస్య  తదాత్మానం శృజామ్యహం” అంటే అదే. కేశవుడే స్వయంగా పరిరక్షణ చేసే ఈ ధర్మానికి అంతు ఎందుకు వుంటుంది? లోక కళ్యాణం కోసం హాలాహలాన్ని  కూడా అరాయించు కోగల శక్తి వున్న అమృత హృదయం కలిగిన స్వర్గం మన సనాతన ధర్మం సంస్కృతి. అందుచేత మనం కూడా ఈ సంస్కృతి గొప్పతనాన్ని గుర్తించి దానిలో తరిద్దాం.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s